Ticker

6/recent/ticker-posts

చంద్రబాబు ఫ్లాప్.. పవన్‌ హిట్ కొడతాడా?


 ఏపీలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోంది. షెడ్యూల్ వెలువడటానికి ఎంతో సమయం లేదు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సిద్ధమౌతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల ప్రచారానికీ దిగింది.


అటు తెలుగుదేశం- జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ జాప్యం కొనసాగుతూ వస్తోంది. భారతీయ జనతా పార్టీని కూడా తమ కూటమిలో కలుపుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నాయి ఈ రెండు పార్టీలు కూడా.

తమ కూటమిలోకి బీజేపీని కూడా కలుపుకోవాలని భావిస్తోన్నాయి తెలుగుదేశం- జనసేన పార్టీలు. దీనికోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటే గానీ విజయం సాధించడం కష్టం అనే బలమైన అభిప్రాయంలో ఉన్నాయి. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే వెల్లడించారు. శతృవు బలవంతుడైనప్పుడు ఉమ్మడిగా యుద్ధానికి దిగాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారామె.

రెండు రోజుల కిందటే చంద్రబాబు బుధవారం ఢిల్లీలో పర్యటించి వచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారాయన. పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించారు. టీడీపీ- జనసేన కూటమితో కలవడానికి అమిత్ షా పెట్టిన ప్రతిపాదనలపై అప్పటికప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయారు చంద్రబాబు. ఇప్పుడు ఈ డ్యూటీని పవన్ కల్యాణ్ తీసుకున్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీకి వెళ్తారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమౌతారు. పొత్తు అంశాలపై చర్చిస్తారు. సీట్ల పంపకాల గురించీ మాట్లాడతారు.