ఏపీలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పర్యటనలు, అందులో చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి మంటపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా తన అన్న, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల చేస్తున్న విమర్శలకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక వైసీపీ ఎమ్మెల్యేలే నలిగిపోతున్నారు. షర్మిలను విమర్శిస్తే ఓ సమస్య, సైలెంట్ గా ఉంటే మరో సమస్య అన్నట్లుగా వారి పరిస్దితి మారుతోంది. ఇదే క్రమంలో బాపట్లలో తాజాగా షర్మిల విమర్శలపై స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే స్పందించారు.
బాపట్ల టూర్ లో నిర్వహించిన బహిరంగసభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఇవాళ స్పందించారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు షర్మిల కాకుండా మరొకరైతే బాపట్ల దాటి వెళ్లేవారు కాదంటూ రఘుపతి వ్యాఖ్యానించారు. మరొకరు ఇవే విమర్శలు చేసి ఉంటే వారిని బాపట్ల దాటనిచ్చే వాళ్లం కాదంటూ రఘుపతి హెచ్చరించారు. దీంతో కోన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
వైఎస్ జగన్ చెల్లెలు, వైఎస్సార్ కుమార్తె కాబట్టే వైఎస్ షర్మిలను వదిలిపెట్టామంటూ కోన రఘుపతి వ్యాఖ్యనించారు. వైఎస్ పై ఉన్న అభిమానంతోనే ఆమెను క్షమిస్తున్నట్లు కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఎన్ని వచ్చినా వైఎస్ జగన్ ను, వైసీపీని ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు సహా ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా వృథాయే అని కోన పేర్కొన్నారు.
Social Plugin