పిల్లలను చిన్నప్పుడు తల్లిదండ్రులు హాస్టల్లో పడేస్తే ఆ పిల్లలే పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేస్తున్నారని ప్రస్తుత సమాజ ధోరణిని ఆయన ఆవిష్కరించారు.
అందుకే పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అందించడంపై దృష్టి పెట్టడం కన్నా సంస్కారం, భారతీయ సంస్కృతిని అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఆదివారం రావులపాలెంలో ముసలి రామాలయం వద్ద ప్రగతి భారతం ట్రస్ట్ అధ్యక్షుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా అన్నదానం చిదంబర శాస్త్రి గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య బాల రామ మందిరం నిర్మాణంలో అతి ముఖ్యమైన యంత్ర నిర్మాణ కర్తృత్వం వహించిన బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సన్మానించుకోవడం ఈ నేల చేసుకున్న అదృష్టమని ట్రస్ట్ అధ్యక్షుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
రాముడంటే పరబ్రహ్మ స్వరూపమని రాక్షసుల చేతుల్లో చిక్కుకొని సూర్యుడు, మేఘాధిపతి అయిన ఇంద్రుడులకు మాత్రమే దక్కి అహల్యగా( దున్నబడని నేలగా) పడి ఉన్న ఈ నేలపై అసుర సంహారం చేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మలిచి ప్రజలంతా మూడు పూటలా అన్నం తినేలా చేసిన మహానుభావుడు శ్రీరామచంద్రుడని అందుకనే మన పెద్దలు "అన్నమో రామచంద్ర" అని ఆయననే కీర్తిస్తారని బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు రామాయణంలో దాగి ఉన్న అతి ముఖ్యమైన ధర్మ సూక్ష్మాన్ని విడమర్చి చెప్పారు. 500 ఏళ్లుగా లక్షలాది ప్రజల ప్రాణ త్యాగ ఫలితంగా ఏర్పడిన రామ మందిరం లో చేసిన యంత్ర నిర్మాణ కర్తృత్వం తనకు దక్కడం హనుమత్ కృపగా, బాల రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కనులారా వీక్షించడం మన అదృష్టంగా చిదంబర శాస్త్రి గారు వర్ణించారు. కార్యక్రమంలో ప్రగతి భారతం ట్రస్ట్ సభ్యులు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Social Plugin